అక్కినేని "మనసులోనిమాట" పార్ట్-34

★అక్కినేని "#మనసులోనిమాట" పార్ట్-34★  
పెద్దలతో పేచీలు
ఐతే దర్శకులతో పేచీలు పడిన సందర్భాలు కూడా వున్నాయి. ఆంటే - 'నా మాటే నెగ్గాలి'
అని కాదు. అసంతృప్తి కలిగినప్పుడు సహజంగా పేచి వస్తుంది కదా! "పరదేశి' జరుగుతున్నప్పుడు దర్శకుడు ఎల్.వి.ప్రసాద్ గారితో చిన్న వాదన జరిగింది. ఆ సినిమాలో అంజలిదేవి గారిది సానుభూతి కలిగించే పాత్ర కాదు. నాది సింపతిటిక్ పాత్ర. ప్రసాద్ గారు ఆమెకి క్లోజప్స్ తీశారు. నిజానికి నా పాత్రకి క్లోజప్స్ అవసరం అని నా ఆభిప్రాయం. ఆయన తియ్యలేదు. షూటింగ్ అయిన తర్వాత రష్ వచ్చింది. "రష్ చూదాం రావయ్యా" అన్నారు ప్రసాద్ గారు. "నేను రాను. చూడక్కర్లేదు
అన్నాను పెడసరంగా, "ఏం?" అన్నారాయన. "మీరు తీసిన విధానం నాకు నచ్చలేదు. 'రాజారాణి సినిమాలో (పరదేశికి మూలమైన హిందీ సినిమా) చూశాంగదా. సానుభూతి పొందే నా పాత్రకి క్లోజప్స్ లేకపోతే దృశ్యం ఎలా రక్తి కడుతుంది?" అని అడిగాను. తర్వాత ఆయన క్లోజప్స్ తీశారనుకోండి. నిజానికి ప్రసాద్ గారెక్కడ? నేనెక్కడ? పల్నాటియుద్ధం', 'సంసారం' సినిమాల్లో ఆయన ఎలా చెబితే అలా చేసిన వాడిని, ఇప్పుడు ఎందుకిలా అడిగాను? అది కూడా - నేనుగా చెప్పలేదు. ఆయన 'రష్ చూదాం' అన్నప్పుడే చెప్పాను. ఇక్కడ - నేను హీరోని, నన్ను ప్రాజెక్ట్ చెయ్యాలి' అని కాదు. దృశ్యానికి ఆ షాట్స్ అవసరం అనిపించింది  చెప్పాను. ఆయన అంగీకరించారు

ఆడపెత్తనం' షూటింగ్ లో, ఆదుర్తి సుబ్బారావుగారితోనూ చిన్న పేచీ వచ్చింది. ఒక ఘట్టంలో- నేను నవ్వితే బాగుంటుందన్నారు ఆయన. 'ఇక్కడ నవ్వితే బాగుండదు' అన్నాను నేను .ఆయన బాగుంటుంది, నవ్వమన్నారు. దృశ్యపరంగా నేను కారణాలు, నా అభిప్రాయం చెప్పినా ఆయన నవ్వమన్నారు. లేదా, రెండు రకాలుగా రెండు షాట్స్ తీదాం అన్నారు. "ఎడిటింగ్ మీచేతిలో వుంటుంది. అక్కడ నవ్వే షాటే వేసుకుంటారు గదా! ఎందుకులెండి. మీరు చెప్పినట్టుగానే నవ్వుతాను." అని నవ్వాను. ఇలా ప్రవర్తించడం - మంచి చెయ్యడానికే, అహంకారం కాదు. పాత్రని అర్థం చేసుకుని నటిస్తున్నప్పుడు నటుడికి కొన్ని భావాలుంటాయి. ఆ భావాలు దర్శకుడికి తెలియవని కాదు. నటుడి దృష్టి కూడా ఆలోచించాలి

కె.విరెడ్డిగారితో కూడా పేచీ వచ్చింది. ఆత్మాభిమానం దెబ్బతిన్నప్పుడు, తప్పదు కద
దొంగరాముడు' షూటింగ్ లో కె.వి.గారు ఏదో అన్నారని, విగ్ తీసిపడేసి వచ్చేశాను. అది- నటనకీ పాత్రకి సంబంధించి కాదు. అందరిలోనూ నన్ను ఒక మాట అని అవమానించారు. తట్టుకోలేక పోయాను. తర్వాత మళ్లీ మామూలే, నాకు వచ్చిన పేచీలన్నీ పెద్దవాళ్లతోనే. నా అభివృద్ధి కాంక్షించినవాళ్లతోనే, నేను ఎంతగానో గౌరవించే వాళ్లతోనే. ఐతే ఆ వాదనలు, పేచీలు గౌరవభావం తగ్గి కాదు. ఒక్కోసారి దేని గురించైనా వాదిస్తే మనం ఎంత వరకూ రైటు - అన్నది తెలుసుకోవచ్చు.
                     సశేషం...
                 -అక్కినేని
★చిత్రంలో చిత్రాలు★
ఎడమవైపు పైన:దర్శకులు ఎల్.వి.ప్రసాద్
కుడివైపు పైన: నటీమణి అంజలీదేవి
ఎడమవైపు క్రింద: దర్శకులు కె.వి.రెడ్డి
కుడివైపు క్రింద:దర్శకులు ఆదుర్తి సుబ్బారావు

(ఈ వ్యాసం   చూచినవారు మీ అభిప్రాయాల వ్యాఖ్యలు అక్షరాల రూపంలో చెయ్యమని మనవి..
కాలాన్ని వెచ్చించి ఈ వ్యాసాన్ని
మీకు అందించే నాకు స్ఫూర్తిదాయకంగా వుంటాయని గమనించగలరు....నూలు

Comments

Popular posts from this blog

అక్కినేని మనసులోని మాట..పార్ట్-1

అక్కినేని "మనసులోని మాట" పార్ట్ -7★

అక్కినేని "మనసులోనిమాట" పార్ట్-36'