అక్కినేని మనసులోని మాట..పార్ట్-1
-#అక్కినేని #ముందుమాట
ఇప్పుడు ఈ పుస్తకం ఎందుకు..!!??
నేను పల్లెటూరి నుంచి వచ్చినవాడిని. చదువుకోలేదు.
సంస్కారం తెలీదు. మాట్లాడ్డం తెలీదు. పెద్దలు కనిపిస్తే
నమస్కారం పెట్టాలని కూడా తెలియని వాడిని, అలాంటి వాడిని ఈ సినిమా ప్రపంచం నన్నొక మనిషిని చేసింది. నటుడిగా తీర్చిదిద్దింది. "అక్కినేని నాగేశ్వరరావు"గా నిలబెట్టింది. పెద్దలసహనాసం, సత్సాంగత్యంతోనే నేను ఎన్నో నేర్చుకున్నాను.
జీవితం తెలుసుకోగలిగాను. మట్టిముద్దలాంటి నాకు
ఎందరెందరో మహనీయులు ఒక రూపం ఇచ్చారు. విభిన్నమైన పాత్రలు ధరింపజేసి నటుడిగా నిలబడ్డానికి అవకాశాలు
కల్పించారు. ధరించిన పాత్రలు కూడా గురువులై నాకు పాఠాలుచెప్పాయి. ఐతే, క్రమేణా పాత్రల్ని ఎన్నిక చేసుకునే స్థితికి వచ్చాను.నేను
చెయ్యగలననుకున్న పాత్రల్నీ చెయ్యదగ్గ పాత్రల్నే
ధరించాను.
ఆస్థితిలో ఎన్నో పాత్రలు నిరాకరించ వలసి
వచ్చింది. ఆ పెద్దలకి ఆగ్రహం తెప్పించవలసివచ్చింది.
మొదట్నుంచి నన్ను ఎంతగానో ప్రోత్సహించి, నా భవిష్యత్తుకి
బాట వేసిన నిర్మాతల మాట నేనెందుకు కాదన్నాను? ఎందుకాపాత్రలు అంగీకరించలేదు?
వారికి మనస్తాపం కలిగించే లాగాఎందుకు ప్రవర్తించవలసి వచ్చింది?
ఈ ప్రశ్నల వెనక బలమైన
కారణాలున్నాయి. పాత్రధారణ విషయంలో నాకు నేనుగాఆలోచించుకుని, విశ్లేషించుకుని చేసుకున్న ఆ నిర్ణయాలు నామనసు చెప్పినవి, అంతరాత్మ బోధించినవి.
నటుడిగా రాణించడానికి ఎన్నో ప్రతిబంధకాలు ఎదుర్కొన్నాను, ఎన్నెన్నో విమర్శలు తట్టుకున్నాను.
కొన్ని పాత్రలు ధరించే అర్హత నాకులేదని కొందరు పెద్దలన్నా,అదొక చాలెంజ్ గా తీసుకుని కష్టించి, కృషి చేశాను. ధరించిన పాత్రలకి ఎంత వరుకు న్యాయం చేశానో తెలీదుగాని, వాటిని చెడగొట్టలేదు!
ఈ నా నటజీవిత
సాగరంలో లేచి పడిన తరంగాలు, సుడిగాలులు అల్లకల్లోలాలు గురించి చర్చించడమే ఈ పుస్తకం. సినిమా నటుడు ఎదుర్కొనే స్థితిగతులు తెలియజెప్పాలనే ఈ పుస్తకం.
అదొక చాలెంజ్ గా తీసుకుని
భవిష్యత్ లో ఎందరెందరో నటీనటులు రాబోతున్నారు.
వాళ్లలోని ఏ ఒక్కరికయినా ఈ పుస్తకం స్పూర్తి కలిగించగలిగితే చాలు. సంతోషిస్తాను.
- అక్కినేని నాగేశ్వరరావు
Comments
Post a Comment