అక్కినేని "మనసులోనిమాట" పార్ట్-36'

★అక్కినేని "#మనసులోనిమాట" పార్ట్-36★   
(దుక్కిపాటి మధుసూదనరావు నిర్మాతగా #అన్నపూర్ణాపిక్చర్స్ #ఆవిర్భావం)
నాటకాల కాలం నుంచి దుక్కిపాటి మధుసూదనరావుగారు నా హితైషి. ఎన్నో సలహాలు శ్రద్ధగా,సూచనలూ ఇస్తూ నా అభివృద్ధికి తోడ్పడిన దైవ సమానులు, పితృతుల్యులు. ఎంతో శ్రద్ధగా క్రమశిక్షణా యుతంగా నాటకసంస్థ నడిపారు. సినిమాల మీద, కథల మీద ఎంతో అవగాహన వున్నవారు. కుటుంబ సమేతంగా సర్వ ప్రేక్షకులూ సినిమాలు చూసే విధంగా మంచి కథలతో సినిమా నిర్మాణం చెయ్యాలని ఆశపడ్డారు. నవయుగ శ్రీనివాసరావు గారితో సంప్రదించారు. వారి ఊహకు నేనూ ఊపిరి పొయ్యాలని - సంస్థ ఆరంభించాము. 
ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ,నేను చైర్మెన్,మధుసూదనరావుగారు మేనేజింగ్ డైరక్టరు. అదే - అన్నపూర్ణాపిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ
అప్పటి వరకూ నేను కె.వి.రెడ్డిగారి దర్శకత్వంలో పని చెయ్యక పోయినా, ఆయన సినిమాలు.. సినిమాలు తీసే విధానం నన్ను ఎంతగానో ఆకర్షించాయి. నిర్దోషంగా స్క్రీన్ ప్లే రాయడంలో సిద్దహస్తులు, ఆయన దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యాలన్న ఆశ వున్నా - మా తొలి సినిమా ఆయన చేత చేయించుకుంటే, చిత్రనిర్మాణ విధానం, పథకాలు, ఆలోచనలూ కూడా తెలుస్తాయనీ, తీసే తొలి సినిమా కూడా, కచ్చితంగా ప్రజాదరణ పొందే విధంగా
రూపొందడానికి అవకాశం వుంటుందనీ అనుకున్నాము. ఐతే, 1951లో వచ్చిన మా
ఆలోచనతో సినిమా ఆరంభించడానికి రెండేళ్లకు పైగా పట్టింది. కె.వి.గారు ఒకసారి ఒక్క సినిమాయే చేస్తారు. అంచేత ఉన్నవి పూర్తి చేసిగాని, అన్నపూర్ణాకి మొదలుపెట్టడం సాధ్యం కాదేమో అంటే - మేము నిరీక్షించాము. 'ఎవరో ఒకరయితే చాలు - మొదలు పెడదాం
అనుకుంటే ఎందుకు తియ్యాలి? తీస్తే, ఉత్తమ ధోరణిలో మంచి సినిమా తియ్యాలి గాని! కోరుకున్న దర్శకుడి కోసం, రెండేళ్ల కాలానికి పైగా నిరీక్షించడం అన్నది సినిమాలోకంలో ఒక రికార్డు అనుకుంటాను. దక్షత గల దర్శకుడు, నిర్మాతా కలిస్తే మంచి ఆలోచనలూ ఊహలూ వస్తాయి. సుదీర్ఘమైన కథాచర్చలు చేసి, చివరికి దొంగరాముడు' కథని స్థిరపరిచారు. 'దొంగరాముడు' దేనికీ అనుసరణ కాదు. అది ఆఫీసులో కూచుని అందరూ చర్చించి, తయారు చేసిన కథ. 'దొంగరాముడు' తీసిన తర్వాత - కథా నిర్ణయం, ఇతర విషయాలూ అన్నీ మధుసూదనరావు గారివే. అందులో నాకు ఎలాంటి సంబంధమూ లేదు. "ఈ కథ నిర్ణయించాం. ఇందులో ఇదీ నీ పాత్ర" అని చెప్పేవారు మధుసూదనరావుగారు. అంతే! ఐతే, తొలి చిత్రానికి కథాచర్చలు, పథకాలూ జరుగుతున్నప్పుడు, నన్ను కూడా ఆ చర్చల్లో పాల్గొనమంటే కూచునేవాడిని. అంతవరకే....
           సశేషం...
                 -అక్కినేని
..★.(అన్నపూర్ణ పిక్చర్స్ అనగానే పాఠకులు ఏ.ఎన్. ఆర్.గారి సతీమణి పేరుగా చాలావరకూ భావిస్తారు...అది ఎంతమాత్రం కాదు... దుక్కిపాటి గారికి చిన్ననాడే తల్లి చనిపోతే.వచ్చిన సవితితల్లి అయిన అన్నపూర్ణమ్మ ఆయనను ఎంతో ప్రేమతో పెంచి పెద్ద చేసిందట...ఆమెకు గుర్తుగా దుక్కిపాటి గారు పెట్టిన పేరే అన్నపూర్ణా పిక్చర్స్ అని అక్కినేని వేరొకసందర్భంలో చెప్పారు... -నూలు)
★చిత్రంలో చిత్రాలు★
ఎడమవైపు పైన:అన్నపూర్ణా పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్- శ్రీదుక్కిపాటి మధుసూదనరావు 
కుడివైపు పైన: అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మెన్- శ్రీ అక్కినేని

(ఈ వ్యాసం   చూచినవారు మీ అభిప్రాయాల వ్యాఖ్యలు అక్షరాల రూపంలో చెయ్యమని మనవి..
కాలాన్ని వెచ్చించి ఈ వ్యాసాన్ని
మీకు అందించే నాకు స్ఫూర్తిదాయకంగా వుంటాయని గమనించగలరు....నూలు

Comments

Popular posts from this blog

అక్కినేని మనసులోని మాట..పార్ట్-1

అక్కినేని "మనసులోని మాట" పార్ట్ -7★