★అక్కినేని "మనసులోనిమాట" పార్ట్-33★



 
★అక్కినేని "#మనసులోనిమాట" పార్ట్-33★  
సెంటిమెంటల్ పాత్రలతో తమ్మారెడ్డి కృష్ణమూర్తిగారు నిర్మించిన 'బంగారు గాజులు', 'ధర్మదాత' మంచి చిత్రాలు. 'ధర్మదాత' రసభరితమైనపాత్ర. నటనకు ప్రాధాన్యం వున్న పాత్ర. ద్విపాత్రాభినయం గల చిత్రం ఇది. చెప్పుకోదగ్గ చిత్రాల్లో ఈ రెండూ చెప్పుకోవచ్చు.
నటుడు ఒక బావిలాంటివాడు. బావిలోంచి ఎంత నీరు తోడుకుంటే అంత నీరూ వస్తుంది. అలాగే, నటుడిలో వున్న శక్తిని రాబట్టుకోగలగాలి. నటించడానికి ఎన్ని విధాల రస సిద్ధి కలిగితే, అంతగా రాణిస్తాడు నటుడు. నేను ఎప్పుడూ ఆ భిన్నత్వం కోసమే ఎదురు చూసేవాడిని. సినిమాకి కథేమిటి? ఆ కథలో నా పాత్ర ఎలాంటిది? అది కథని ఎలా నడిపిస్తుంది? ఆ పాత్రని నిర్వహించడంలో నేను చెయ్యవలసిన కృషి ఏమిటి? 
ఇదే నా ఆలోచన....
ఒక సినిమాకి 'దర్శకుడు' అంటే - సినిమాలో ఉన్న అన్ని శాఖల్నీసమన్వయపరిచి, కావలసింది రాబట్టే వ్యక్తి. నటీనటులందరినీ పాత్రల పరంగా నియంత్రించే వ్యక్తి. ఆ దర్శకుడు ఎప్పుడూ సమర్థుడై వుండాలి. నేను చాలామంది సమర్థులైన దర్శకుల దగ్గర పని చేశాను కాబట్టే, నాలో నిక్షప్తమైవున్న నటనాంశాన్ని బహిరంగ పరచగలిగాను. ఐతే, కొందరు అసమర్థులైన దర్శకులు కూడా వుండొచ్చు
అది గణనీయం కాదు. కొత్తగా దర్శకులైన వాళ్ల దగ్గర కూడా పని చేశాను. అందరూ అనుభవజ్ఞులే వుండాలని నేనెన్నడూ అనుకోలేదు. ప్రతి దర్శకుడు, నటుడూ మొదట్లో కొత్తవాళ్లే కదా. ఏమో! ఏ పుట్టలో ఏ పాముందో అన్నట్టు - ఎవరిదగ్గర ఎలాంటి ప్రతిభ దాగివుందో! ఐతే కొత్త దర్శకులు నాలాంటి సీనియర్ల దగ్గర అంత స్వేచ్ఛగా వుండలేరు.
నటులు వాళ్లని ప్రోత్సహించాలి. వాళ్ల అభిప్రాయాల్ని ధైర్యంగా చెప్పగలిగేలా నటులు ఉత్సాహపరచాలి. నేనుతొలిరోజుల్లో అనుభవజ్ఞులైన దర్శకుల దగ్గర పని చేసినప్పుడు నా పరిస్థితీ అంతే కదా! కొత్తగా వచ్చిన నటీనటులకీ, దర్శకులకీ ఆ బెరుకు ఉండడం సహజం
ఐతే, దర్శకుడిగా ఎవర్ని అంగీకరించినా అతని నిర్ణయమే శిరోధార్యం నాకు. దర్శకుడు ఎప్పుడూ కమాండరే! నేనెప్పుడూ సోల్జర్నే... అనుమానాలు,సందేహాలూవున్నప్పుడుచర్చలుచేసుకున్నా- 'నామాటే నెగ్గాలి' అన్న పట్టు ఎప్పుడూ లేదు. వాదించినా, చర్చించినా నిర్ణయం దర్శకునికి ఇవ్వడం - నా విధానం
                  సశేషం...
                 -అక్కినేని
★చిత్రంలో చిత్రాలు★
కుడివైపు పైన:బంగారు గాజులు చిత్రం
ఎడమవైపు క్రింద: నిర్మాత తమ్మారెడ్డి కృష్ణమూర్తి

(ఈ వ్యాసం   చూచినవారు మీ అభిప్రాయాల వ్యాఖ్యలు అక్షరాల రూపంలో చెయ్యమని మనవి..
కాలాన్ని వెచ్చించి ఈ వ్యాసాన్ని
మీకు అందించే నాకు స్ఫూర్తిదాయకంగా వుంటాయని గమనించగలరు....నూలు

Comments

Popular posts from this blog

అక్కినేని మనసులోని మాట..పార్ట్-1

అక్కినేని "మనసులోని మాట" పార్ట్ -7★

అక్కినేని "మనసులోనిమాట" పార్ట్-36'