★అక్కినేని "మనసులోనిమాట" పార్ట్-28★
★అక్కినేని "#మనసులోనిమాట" పార్ట్-28★
*పెద్దల మాట తిరస్కరించాను*
అద్భుతమైన పాత్రలు నాచేత చేయించిన నా శ్రేయోభిలాషులు రామకృష్ణగారు భానుమతి గార్లకు బాధ కలిగించే సందర్భం వచ్చింది. దురదృష్టకరమైన సంఘటన.
నేను కొంతకాలం విశ్రాంతికని, కాశ్మీర్ వెళ్లాను, అక్కడ వుండగా నాకు రెండు లేఖలు వచ్చాయి. ఒకటి భరణి రామకృష్ణగారు, ఇంకొకటి ఆదినారాయణ రావుగారూ రాశారు.
కాళ్లకూరి నారాయణరావుగారి 'చింతామణి' బాగా ప్రసిద్ది పొందిన నాటకం. అది సినిమాగా తియ్యాలని ఉద్దేశిస్తున్నాం, నువ్వు బిల్వమంగళుడు పాత్ర వెయ్యాలి అంటూ, రామకృష్ణగారు రాశారు. ఒక్కసారి దిగ్గుమని పోయాను. చింతామణి లాంటి పాత్రను భానుమతిగారు ధరించడమా! నేను బిల్వమంగళుడా! ఈ రెండు అంశాలూ నాకు నచ్చలేదు. లైలామజ్నూ, విప్రనారాయణ లాంటి చిత్రాలు అందించిన భరణి సంస్థ ఈ సినిమా తీస్తే ఏం బాగుంటుంది? భవాని శంకరుడు, సుబ్బిశెట్టి, బిల్వమంగళుడులాంటి పాత్రల మధ్య తిరిగే చింతామణి పాత్ర చెయ్యాలని భానుమతిగారికి ఎందుకు అనిపించిందో! ఏమైనా గట్టి మనసు చేసుకుని నా అభిప్రాయం రాసేశాను. 'అసలా సినిమాని మానుకోండి' అనికూడా రాశాను. ఎంతో ఆవేదనతో, బాధతో రాసినలేఖ అది,. నా శ్రేయోభిలాషుల మాట కాదన్నందుకు నేనెంత నొచ్చుకోవాలో అంతగానూ నొచ్చుకుంటూ రాశాను.
అలాగే, ఆదినారాయణ రావుగారు- "శకుంతల తీద్దాం అనుకుంటున్నాం. మీరు
దుష్యంతుడుగా వెయ్యాలి" అని రాశారు. ఈ రెండు సంస్థలకీ నేను అత్యంత ఆత్మీయుడిని, అందరూ నన్ను ప్రోత్సహించినవారే.
కాని, ఇప్పుడు వారి అభిప్రాయంతో
వ్యతిరేకించవలసి వచ్చింది. "శకుంతల ఒక క్లాసిక్, అంజలిదేవి గారు ఇప్పుడాపాత్ర చేస్తే బాగుండదేమో! నేను మాత్రం దుష్యంత మహరాజుకి పనికి రాను.కాబట్టి వెయ్యలేను. మీరు తియ్యాలని నిర్ణయించుకుంటే- అది సాహసమే అవుతుంది. ఆపైన మా యిష్టం. 'తీస్తాం' అని నిర్ణయించుకుంటే మాత్రం నేను దుష్యంతుడికి సరిపోనుకాబట్టి, వెయ్యలేను." అని ఆదినారాయణరావుగారికి రాశాను.
ఎందుకనో మరి, అంజలి పిక్చర్స్
వారు 'శకుంతల' ప్రయత్నం
విరమించుకున్నారు గాని, భరణీవారు 'చింతామణి' తియ్యడానికే నిర్ణయించు కున్నారు.రామారావుగారి చేత, బిల్వమంగళుడు వేయించారు. ఈ చిత్రం ప్రారంభం అయిన తర్వాత- ఒక సందర్భంలో కలిసినప్పుడు రామారావుగారు నన్ను అడిగారు- "బిల్వమంగళుడు ఎందుకు
ఒప్పుకోలేదు?" అని, "కాల్షీట్స్ కుదరలేదు బ్రదర్" అని చెప్పాను లౌక్యంగా, ఇలాంటి స్థితిలోనే సంస్కారం కనిపించాలి. ఆయన ఆ పాత్ర ధరిస్తున్నప్పుడు, ఆ పాత్రమీద నాకున్న అభిప్రాయంచెప్పడం, నాకు నచ్చక నేను అంగీకరించలేదని చెప్పడం సంస్కారం కాదు, ధర్మం కాదు. అందుకే కదరలేదు" అని చెప్పాను.
సశేషం
-అక్కినేని
★★★★★★★★★★★★
చిత్రంలోని చిత్రాలు...
ఎడమవైపు పైన: భరణి పిక్చర్స్ నిర్మాత రామకృష్ణ
ఎడమవైపు క్రింద:అంజలి పిక్చర్స్ నిర్మాత ఆదినారాయణరావు
కుడివైపు పైన: నటీమణి భానుమతి
కుడివైపు క్రింద:నటీమణి అంజలీదేవి
(ఈ వ్యాసం చూచినవారు మీ అభిప్రాయాల వ్యాఖ్యలు అక్షరాల రూపంలో చెయ్యమని మనవి..
కాలాన్ని వెచ్చించి ఈ వ్యాసాన్ని
మీకు అందించే నాకు స్ఫూర్తిదాయకంగా వుంటాయని గమనించగలరు....నూలు
Comments
Post a Comment