★అక్కినేని "#మనసులోనిమాట" పార్ట్-26★

 
★అక్కినేని "#మనసులోనిమాట" పార్ట్-26★
 మొత్తానికి #కృష్ణార్జునయుద్ధం'లో అర్జునుడి పాత్రే నన్ను వరించింది. రొమాంటిక్ పాత్ర
పాటలున్నాయి, దర్శకుడు, రచయిత సమగ్రమైన పాత్రగా రూపొందించారు. ఐతే, చిత్రం చివరిలో అర్జునుడు, కృష్ణుడూ పోటీ పడినప్పుడు- అర్జునుడు రథం దిగి కృష్ణుడికి నమస్కరించాలి.అది ఆ పాత్ర లక్షణం, సంస్కారం. నేను కింద నిలబడ్డాను. రామారావుగారు రథంమీద వున్నారు. నేను మరీ పొట్టిగా, వున్నట్టనిపించింది. రామారావుగారికి ఎదురుగా వున్నా, పక్కన పున్నా ఆయనదే ఆకర్షణీయ రూపం. "కృష్ణార్జున యుద్ధం' చిత్రం చూసినతర్వాత, నా భార్య ఒక మాట అంది : "
ఇంకెప్పుడూ రామారావుగారి పక్కన పౌరాణిక. చిత్రాలలో వెయ్యకండి!" అమె అన్నమాట నిజమే కదా! ఇంతటి సద్విమర్శ చెయ్యగల అన్నపూర్ణ నా భార్య అయినందుకు ఎంతో గర్వపడ్డాను 
మళ్లీ 'విప్రనారాయణ' విషయానికి వస్తే, ఈ అగ్ని పరీక్షలో కూడా నెగ్గాలనుకున్నాను. విప్రనారాయణుడు పరమ భాగవతోత్తముడు, నిష్ణాగరిష్టుడు,శ్రీరంగనాథుడి చింత తప్ప ఐహిక వాంఛలు లేనివాడు. అలాంటివాడు దేవదేవి వేసిన ఉచ్చులో చిక్కుకున్నాడు, పాత్ర తీరులో మలుపులున్నాయి, ఘర్షణ వుంది. భాషా సంపదగల సంభాషణలున్నాయి. 
"ఈ పాత్ర కూడా నాకు మంచి పేరు తెచ్చిపెడుతుంది, నేనుగట్టిగా కృషి చెయ్యాలి" అని నిర్ణయించుకున్నాను. సముద్రాల రాఘవాచార్యగారితో కూచుని సంభాషణలు చదువుతూ, తప్పొప్పులు, ఉచ్చారణ సవరించుకుంటూ, అర్థాలు తెలుసుకుంటూ కంఠస్థం చేసేవాడిని, తెల్లవారుజామున లేచి, సంభాషణలు చదువుతూ మననం చేసుకునేవాడిని, సంభాషణ ఎక్కడ విరిచి చెప్పాలి? ఎలా మాడ్యులేట్ చేస్తే
బాగుంటుంది - అని ఆలోచించేవాడిని. అలాంటి పాత్ర నటించడానికి కొంత స్ఫూర్తి
అవసరమవుతుందని నాగయ్యగారి 'భక్తపోతన' చిత్రం మళ్లీ మళ్లీ చూశాను. ఆ పాత్రలో ఆయన నటించిన విధానం, అభినయం, భక్తిభావం గ్రహించాను.
 షూటింగ్స్ లోని కొన్ని దృశ్యాల్లో దర్శకుడు రామకృష్ణగారితో చర్చించి- ముందుగా చేసి చూపించి- నా ఉద్దేశం తెలియ జేసేవాడిని, షాట్లో నటించిన తర్వాత, రామకృష్ణగారు బాగుందన్నా నాకు  తృప్తిగా వచ్చినట్టు అనిపించకపోతే ఇంకో టేక్ చేదాం అని అడిగేవాణ్ణి. ఈ కళకి అంతేముంది.
ఎంత బాగాచేస్తే అంత మంచిది. ఓర్పు వహించాలి. పాత్ర మీదనే దృష్టి కేంద్రీకరించాలి.
నటుడి బాధ్యతే అది. ఐతే, ఎంత స్వచ్చంగా సంభాషణ చెప్పినా 'శ్రీ' సరిగా పలకలేక
పోయానన్నారు. 'స్త్రీ' అని వచ్చిందిగాని, శకార శబ్దం స్వచ్ఛంగా వినిపించలేదు.అవన్నీ మళ్లీ 'డబ్' చేశాను. చిత్రం ప్రజల్లోకి వెళ్లిన తర్వాత "నాగేశ్వరరావు ఈ పాత్రకూడా అద్భుతంగా నిర్వహించాడు " అన్న ప్రశంసలు విన్న తర్వాత- కృషి ఫలించిందన్న తృప్తి కలిగింది.
                సశేషం
              -అక్కినేని
(ఈ వ్యాసం   చూచినవారు మీ అభిప్రాయాల వ్యాఖ్యలు అక్షరాల రూపంలో చెయ్యమని మనవి..
కాలాన్ని వెచ్చించి ఈ వ్యాసాన్ని
మీకు అందించే నాకు స్ఫూర్తిదాయకంగా వుంటాయని గమనించగలరు....నూలు)

Comments

Popular posts from this blog

★అక్కినేని "మనసులోనిమాట" పార్ట్-31★ హాస్య పాత్ర

అక్కినేని మనసులోని మాట..పార్ట్-1

అక్కినేని "మనసులోనిమాట" పార్ట్-36'