అక్కినేని మనసులోనిమాట పార్ట్-16
★#అక్కినేని"#మనసులోనిమాట"పార్ట్-16★
మొదటి సాంఘికం
ఆ నిరీక్షణలో 'సంసారం' వచ్చింది. నేను
సంతోషంచినా, నన్ను వెంటాడే ఆ సమస్య మాత్రం వూరుకోలేదు. మళ్లీ చాలామందికి సందేహాోలు మొదలైనాయి. "జానపదాల్లో వేసే వాడు సాంఘికాలకేం పనికొస్తాడు?" అన్నారు. నా మీద నాకే అనుమానం వచ్చేలా పరిశ్రమలో మాటలు వినిపించాయి. ఎదురవుతున్న నిరుత్సాహాన్ని పక్కకితోసేసినా, సాంఘిక పాత్రకి తగ్గట్టు దుస్తులువేసుకుని, మేకప్ వేసుకుని, స్టిల్స్ తీయించుకున్నాను
నిలువుటద్దం ముందు నిలబడి, సాంఘిక పరమైన సంభాషణలు చెప్పి చూసుకున్నాను. ఆత్మవిశ్వాసం,మనోబలం వుంటే, ఆ భయాలన్నీ పారిపోతాయని
రూఢి చేసుకున్నాను. 'సంసారం' నిర్మాతలు పారితోషికం తక్కువ ఇస్తానన్నా పర్వాలేదనుకునిఈ సాంఘిక పాత్రతో ప్రజల ముందు నిలబడ్డానికి పట్టుదల పట్టాను: సాంఘింక చిత్రంలోనూ నటించగలనని నిరూపించాలనుకున్నాను
ఆ పాత్ర పల్లెటూరి బైతు పాత్ర.
అమాయకమైన స్వభావం. 'తస్సదియ్య' అని ఒకవూతపదం కూడా వుంది. 'సంసారం' దర్శకుడు యల్.వి.ప్రసాద్ గారు సహజంగా నటుడు గనక, ఆపాత్ర తీరుతెన్నులు, ప్రవర్తన అన్నీ వివరంగా చెప్పారు. పాత్రని కాస్త అతిగా చెయ్యవలసిన అవసరం కూడా వుంటుందన్నారు. ఆ పాత్రలో
పున్న అమాయకత్వానికి ప్రేక్షకులు నవ్వుకుంటారు.
అలా, కొంత హాస్యం కూడా ఇమిడి వుంది అందులో ఐతే, నా మొదటి సాంఘిక చిత్రం కాబట్టి, దర్శకుడు చెప్పినట్టే చేశాను. ప్రసాద్ గారు చెప్పినదీ, చేసి చూపించినదీ - అలాగే అనుసరించాను. ఐతే, కేవలం ఏదో బొమ్మని
ఆడించినట్టుగా కాదు. నాలో విశ్వాసం పెంచుకుని, పాత్రకో రూపం ఇవ్వాలని గట్టి
పట్టు పట్టాను.'నేను సాంఘికాలకి పనికి రాను' - అని పదిమందీ చెప్పుకున్న మాటలే
నాలో పౌరుషం, పట్టుదల రేకెత్తించాయి. 'పనికిరాడు, పనికిరాడు' అన్న మాటలే
ఆశీర్వచనాలుగా తీసుకున్నాను. 'సంసారం' ఘనవిజయం సాధించింది! ఆ
విజయసాధనలో నాగేశ్వరరావు కూడా నెగ్గాడు..( సంసారం చిత్రంలో..నేనూ..కథానాయకి పుష్పలత)
( సశేషం)
-అక్కినేని
(ఈ వ్యాసం చూచినవారు మీ అభిప్రాయాలు కామెంట్లు మాటలలో చెయ్యమని మనవి..
కాలాన్ని వెచ్చించి ఈ వ్యాసాన్ని మీకు అందించే నాకు స్ఫూర్తిదాయకంగా వుంటాయని గమనించగలరు....నూలు
Comments
Post a Comment