అక్కినేని"మనసులోనిమాట"పార్ట్-12★
★అక్కినేని"మనసులోనిమాట"పార్ట్-12★
నాకు ఘంటసాలగారనే కాదు - తక్కిన గాయకులూపాడారు. కాని, ఘంటసాలగారే ఎక్కువగా పాడారుఆయన కంఠం నా కంఠానికి అతుక్కుపోయినట్టుగావుండేది. గాత్రంలో భావం ఒలికిస్తూ, రసోత్పత్తి చేస్తూ
పాడేవారు గనక, నటించే వారికి సౌలభ్యంగా వుండేది. నాకుపాట తెలుసు గనక, తాళజ్ఞానం వుంది గనక, ప్లేబాక్ పాటని సరిగ్గా అనుసరించే వాడిని. ఐతే, ఇక్కడ ఇంకో చిక్కువచ్చి పడింది. నేను కూడా ఆ పాటతో పాటు, నటిస్తూగట్టిగా పాడే వాడిని. 'లైలా మజ్నా'లోనో ఎందులోనోగుర్తులేదు గాని, భానుమతి గారితో పాడుతూనటిస్తున్నప్పుడు ఆమె నా పాట విని, "అబ్బా! హీరోఅపశ్రుతి పలుకుతోందయ్యా నీ కంఠం.... తగ్గించు" అని మందలించారు. ఇది మళ్లీ నటుడికి ఇంకో పరీక్ష! నోటినుంచి శబ్దంపాడితే, మెడమీద నరాలూ అన్నీ సహజంగా అవే రానీయకుండా పాడాలి! పాటతో పాటు ఘంటసాల కదులుతూ, పొంగుతూ పాడుతున్న భ్రాంతి కల్పిస్తాయి కాని, పాడకుండా వట్టి గాలితో పాడాలంటే? అదొక ప్రయోగం. నటనలో అది కూడా ఒక భాగమేనేమో అలా, 'నిశ్శబ్దగాత్రం'తో ప్రాక్టీస్ చేశాను. భానుమతిగారు చెప్పిన ఆనాటినుంచి, తర్వాత వచ్చినఅన్ని పాటలూ, నిశ్శబ్దభావంతోనే పాడాను. పద్యాలూ అంతే! 'మహాకవి కాళిదాసు'లోని 'మాణిక్యవీణా..జయభేరి' లోని 'రసికరాజా తగువారముకామా...' లాంటి పాటలు, వేగగతిలో పద్యాలు సాగే స్వరాలూ అన్నీ నిశ్శబ్దంగానే! అదీ ఒక సాధనే! ఐతే, ఇలా నిశ్శబ్దంగా పాడడం ఒక విధంగామంచి విధానం అని కూడా తెలుసుకున్నాను. ప్లేబాక్ యంత్రంలో వినిపిస్తున్న పాటతోపాటు గట్టిగాపాడితే ఆ గొంతు వినిపించదు. నా గొంతే నాకు వినిపిస్తుంది. నిశ్శబ్దంగా పాడినప్పుడు, ఆ పాటబాగా వినిపిస్తుంది. దానివల్ల పెదవులకదలికతో పాటు, భావ ప్రకటనని కూడా మనకి మనమేనిర్ణయించుకోవచ్చు. నటులకి పాట పాడడం కూడా తెలిస్తే, అదొక అదనపు అర్హత. పెదవుల
కదలిక, భావ ప్రకటన సుళువు అవుతాయి.
ఇంకోటుంది - కొన్ని సన్నివేశాల్లో తంబురా మీటుతూ పాడాలంటే, తంబురా మీటడం తెలియాలి. వాద్యం వాయిస్తూ పాడాల్సి వచ్చినప్పుడు, వాద్య విధానం తెలుసుకోవాలి. పూజా ఫలం సినిమాలో నేను వయొలిన్ వాయించాలి. వయొలిన్ని ఎలా పట్టుకోవాలి - ఎలా కూచో పెట్టాలి వాయిస్తున్నప్పుడు స్థాయి ప్రకారం వేళ్లు ఎలా కదలాలి - ఇవన్నీ క్షుణ్ణంగాప్రాక్టీస్ చేశాను. అది దర్శకుడు బి.ఎన్.రెడ్డిగారి సలహా. వయొలినిస్టునిచ్చి, ప్రాక్టీసు చేయించారు. ఆరోహణాక్రమం, అవరోహణా క్రమం - తప్పిపోకుండా వేళ్లనికదిలిస్తూ వాయించడం అభ్యసించాను. ప్లేబాక్ లో వచ్చే వయొలిన్ స్వరాలు - మంద్రస్థాయి తారస్థ్రాయిలో వున్నప్పుడు వేళ్లు స్థాయికి తగ్గట్టే కదలాలి. మంద్రస్థాయిలో స్వరం వుంటే వేళ్లు తారస్థాయిలో కదుల్తూ వుంటే? చూసిన వాళ్లందరికీ ఇది తెలియక పోవచ్చునేమో గాని సంగీతం తెలిసిన వాళ్లు నవ్వుకుంటారు, ఆక్షేపిస్తారు! అందుకని, అదీ అభ్యసించాను.
డాక్టర్ చక్రవర్తి'లో సితారు వాయిస్తూ పాడిన 'మనసున మనసై...' కూడా అలాగే
నేర్చుకున్నాను. వేళ్లు తీగల మీద సరైన తీరులో నడుస్తూ వుంటే - నటుడే వాయిస్తున్న బ్రాంతి నూటికి నూరుపాళ్లూ కలుగుతుంది. సినిమా అంతా భ్రాంతే కదా! పియానో
వాయించినా, మురళి వాయించినా అన్నీ కూడా విధానం తెలుసుకునే వాయించాను.
ఒక విశేషం : 'మాయలోకం' సినిమాలో ఒక పాట రికార్డింగ్లో నేను జలతరంగిణి వాయించాను
(సశేషం)
-అక్కినేని
(ఈ వ్యాసం చూచినవారు మీ అభిప్రాయాలు కామెంట్లు మాటలలో చెయ్యమని మనవి..
కాలాన్ని వెచ్చించి ఈ వ్యాసాన్ని మీకు అందించే నాకు స్ఫూర్తిదాయకంగా వుంటాయని గమనించగలరు....నూలు
Comments
Post a Comment