అక్కినేని"మనసులోనిమాట"పార్ట్-11★
★అక్కినేని"మనసులోనిమాట"పార్ట్-11★
#ఘంటసాల #గాత్రసహకారం
సీతారామ జననం', 'మాయలోకం', 'పల్నాటి యుద్ధం' సినిమాల్లో నేను పాడవలసిన పాటలు నేనే పాడుకున్నా,'బాలరాజు'లో కూడా నేనే పాడినా, ఒకపాట మాత్రం ఘంటసాలగారి చేత పాడించవలసి వచ్చింది. ఆ పాట 'చెలియా కనరావా..' అన్న పాట..నేను పాడగా ఆ పాటని ముందుగానే న్యూటోన్ స్టూడియోలో దిన్హా కె.టెహరానీ (సౌండ్ ఇంజనీర్) రికార్డు చేశారు. బాగానే వచ్చింది. అందరూ బాగానే వుందన్నారు.పాట తెలిసిన వాడిని గనక, నాకెందుకో 'ఇంకాబాగుండొచ్చు'అనిపించింది. కాని, గట్టిగా అనలేక పోయాను. ఆ పాట ట్రాక్ గ్రామఫోన్ రికార్డుకి వెళ్లి పోయింది. ఆరోజుల్లో రికార్డ్ మీద ఎక్కడానికి కలకత్తా వెళ్లాలి.
తొమ్మిది నెలల ముందు పంపితే గాని సినిమా విడుదల వేళకి రికార్డు మార్కెటి కి రాదు. చెలియా కనరావా..."పాట చిత్రీకరణ కూడా అయి పోయింది. ఎడిటింగ్ అయిపోయిన తర్వాత కూడా నాలో ఆ మీమాంస వదల్లేదు. శ్రుతిపక్వంగానే పాడానులోపం లేదు. కాని, మంచి పాటపాపులర్ కావడానికి అవకాశం వున్నపాట. దాన్ని అలా వదిలేయ కూడదు.
ఇక లాభంలేదని నాలో నలుగుతున్న తర్జన భర్జన ఆపి, బలరామయ్య గారితో చెప్పేశాను. "పాట బాగానే వచ్చిందను కోండి. ఎందుకో నాకు మాత్రం తృప్తిగా లేదు. ఘంటసాలగారి చేత పాడిస్తే...” అని సణిగాను. బలరామయ్యగారు 'అలాగే చేద్దాంలే' అన్నారు. బహుశా నా మనసులో వున్నదే
ఆయన మనసులోనూ వుండి వుంటుంది - "నీ పాట అంత బాగులేదయ్యా, ఘంటసాల చేత పాడిద్దాం" అని ఆయన నాతో అంటే, నేనేమైనా బాధ పడతానేమో,నిరుత్సాహపడతానేమోనని -చెప్పివుండకపోవచ్చు. అప్పుడు ఘంటసాలగారి చేత మళ్లీ రికార్డు చేయించి, నేను అభినయించిన చిత్రం మీద కలిపారు. 'బాలరాజు'లో వున్న ఇంకోపాట నేను, యస్.వరలక్ష్మి పాడాం. అది అలాగే వుంచేశారు. , యస్.వరలక్ష్మి మంచిగాయని గనక, ఆ పాట అంత ఇబ్బంది అనిపించలేదు.
అలా ప్రవేశించారు నా నట జీవితంలో ఘంటసాల - గాత్ర సహకారిగా, అంతే ఆనాటి నుంచి, ఆయన చివరి దశ వరకూ వీలున్న ప్రతి సినిమాలోనూ ఆయన పాటే నాకు అలా హత్తుకుపోయింది. ఎన్నెనో పాటలు నా నటనకు సగం జీవం పోశాయి. తొలిరోజుల్లో
ఇద్దరం ప్రతిభా ఆఫీసులో వున్నప్పుడు ఆయన తంబురా మీటుతూ, సంగీత సాధన చేసేవారు. నన్ను ఆప్యాయంగా 'తమ్ముడూ' అని పిలిచే వారాయన. (సశేషం)
-అక్కినేని
(ఈ వ్యాసం చూచినవారు మీ అభిప్రాయాలు కామెంట్లు మాటలలో చెయ్యమని మనవి..
కాలాన్ని వెచ్చించి ఈ వ్యాసాన్ని మీకు అందించే నాకు స్ఫూర్తిదాయకంగా వుంటాయని గమనించగలరు....నూలు
Comments
Post a Comment