★అక్కినేని "మనసులోని మాట" పార్ట్ -6★

★అక్కినేని "మనసులోని మాట"  పార్ట్ -6★
#పితృతుల్యులు #దుక్కిపాటి మధుసూదనరావుగారు
ఎక్సెల్షియర్ థియేటర్ అని, ముదినేపల్లిలో మంచి నాటక సంస్థ. కోడూరి అచ్చయ్య చౌదరిగారు ఆ సంస్థకి అధ్యక్షులు, 
దుక్కిపాటి మధుసూదనరావుగారు
కార్యదర్శి. వరసగా నాటకాలు ప్రదర్శిస్తూ వుంటారు. గుడివాడ కుర్రవాళ్ళతో బుద్ధిరాజు శ్రీరామమూర్తిగారి (హార్మోనిస్టు) ఆధ్వర్యంలో 'విప్రనారాయణ'లో దేవదేవి వేషం వేశాను అది చూసి మా అన్న రామబ్రహ్మంగారితో మాట్లాడి ఆయన ముదినేపల్లి తీసుకువెళ్లారు.
సంప్రదాయమైన విధానం, క్రమశిక్షణ గల సంస్థ అది. కోడూరి అచ్చయ్య చౌదరిగారు
మంచి నటుడు. పాత్రల మీద అవగాహనవున్న వారు. ఆయన బాగా శిక్షణ ఇచ్చేవారు.

మధుసూదనరావుగారు, తక్కిన విషయాలు చూసుకునేవారు. ఐతే, ఏ క్షణం నన్ను మధు సూదనరావుగారికి పరిచయం చేసిందోగాని - ఆ క్షణం అమిత బలీయమైనది.
నన్ను తీర్చిదిద్దిన వారిలో ఒకరిగా, నా బాగోగులు, మంచి చెడ్డలు చూసేవారిగా మాఅన్నపూర్ణ సంస్థకు నిర్మాతగా మధుసూదనరావుగారు ఒక వృక్షంలాగా నిలబడి, నన్నుఆదరించారు. ఆనాటి నుంచి ఆ అనుబంధం - కొనసాగుతూనే వచ్చింది - ఒక్కస్టూడియో నిర్మాణం విషయంలో తప్ప...?
ఎవరైనా, జీవితంలో రాణించడానికి, సాధించడానికి, నిలదొక్కుకోడానికీ ఎందరి తోడ్పాటోఅవసరమవుతుంది. ఆ తోడ్పాటును ఆలంబన చేసుకుని, మాను మీద ఎదిగే లతలా ఆ వ్యక్తి ఎదగగలగాలి. నా అదృష్టం, నా భాగ్యం - అటువంటి మహావ్యక్తుల ఆశీస్సులు తోడ్పాటూ లభించాయి. నన్ను సక్రమమైన దారిలో నడి పించిన మార్గదర్శకులందరూ
నిత్యస్మరణీయులే తప్ప. ఎప్పుడూ అభిప్రాయభేదం అంటూ రాలేదు.
ఎక్సెల్షియర్ సంస్థలో నన్ను శాశ్వత నాయికా పాత్రధారిణిగా స్థిరపరచడంతో
గుడివాడలో మకాం పెట్టి, అమ్మని కూడా తీసుకొచ్చాను. తొలిరోజుల్లో నాటకానికి
అర్థరూపాయి సంపాదించిన నేను - ఇప్పుడు ఐదు రూపాయలు సంపాదించే స్థాయికిఎదిగాను. ఈ తొమ్మిది సంవత్సరాల్లో వెయ్యి రూపాయలు సంపాదించ గలిగాను..
నా అభిప్రాయంలో అది అప్పుడు పెద్ద ఘనతే...
ఆ సంస్థ ప్రదర్శించిన 'తెలుగుతల్లి', సత్యాన్వేషణం', 'ఆశాజ్యోతి' సాంఘిక
నాటకాల్లో నేనే హీరోయిన్ ని. సాంఘిక నాటకాలు అలవాటు కావడంతో పాటు
క్రమశిక్షణ, కొంత సంస్కారం కూడా అలవడ్డాయి. నాకు ఎన్నో పాఠాలు నేర్పిన కళాశాల.ఆ సంస్థ. పెండ్యాల నాగేశ్వరరావుగారు ఆ నాటకాలకి సంగీతం సమకూర్చేవారు. నాటక
బృందానికి, ప్రదర్శనలకీ మంచి పేరుండేది గనక, ఎన్నో ఊళ్లలో ప్రదర్శన అవకాశాలు
వచ్చాయి. అలా వూళ్లు తిరుగుతూ - తెనాలి నుంచి వస్తున్నప్పుడే- బెజవాడ ప్లాట్ ఫాం మీద జరిగిన ఆ అద్భుత, అనూహ్య, నిరంతర స్మరణీయ సంఘటన...(సశేషం)
    -అక్కినేని
(ఈ వ్యాసాలు చూచినవారు మీ అభిప్రాయాలు కామెంట్లు మాటలలో చెయ్యమని మనవి..
కాలాన్ని వెచ్చించి ఈ వ్యాసాన్ని మీకు అందించే నాకు స్ఫూర్తిదాయకంగా వుంటాయని గమనించగలరు....నూలు)

Comments

Popular posts from this blog

★అక్కినేని "మనసులోనిమాట" పార్ట్-31★ హాస్య పాత్ర

అక్కినేని మనసులోని మాట..పార్ట్-1

అక్కినేని "మనసులోనిమాట" పార్ట్-36'