అక్కినేని మనసులోని మాట..పార్ట్-3
అక్కినేని మనసులోని మాట..పార్ట్-3
#నిజమైన #జన్మదినం
1924మే నెల, 8వ తేదీ
ఈ రోజు మద్రాసు నగరంలో నేను సినిమా నటుడిగా అడుగుపెట్టిన రోజు..
అందుకే, ఈ రోజునే నేను నా పుట్టిన రోజుగా భావిస్తాను. దుక్కిపాటి మధుసూదన రావుగారు ఎక్సెల్షియర్ నాటక సంస్థకి కార్యదర్శి. వారికీ నాకూ ఏ చుట్టరికం లేకపోయినా నన్నెంతో ఆదరించేవారు. అన్నివిధాలా ఆయన నాకు పెద్ద దిక్కు గనక ఆయనే నన్ను మద్రాసు తీసుకొచ్చారు. మేమిద్దరం, మాతోపాటు పోలవరపు
సూర్యప్రకాశరావుగారు ముగ్గురం రైల్వే స్టేషన్ నుంచి, జట్కా బండిలో బయల్దేరి ప్రతిభా ఆఫీసు దగ్గర దిగాం. సినిమా ప్రపంచంలో నాతొలి అడుగు పడింది. శ్రీరాముడి పాత్రకి కొత్త వాడొచ్చాడని, నన్ను చూడ్డానికి పెద్దలు వచ్చారు. పేకేటి శివరాం, బలిజేపల్లి లక్ష్మీకాంతంగారు, మేనేజర్ కోటీశ్వరరావుగారు, అందరూ నన్ను చూస్తూ “రాతమ్ముడూ - రా" అని లోపలికి పిలుస్తూ వుంటే, ఎక్కడి వాడిని- ఎక్కడి కొచ్చాను
ఎక్కడో గ్రామంలో పుట్టి, తిరిగిన వాడిని... ఈ పెద్దల మధ్యకి వచ్చానా? నా బాల్య దశ గుర్తొచ్చింది
గుడివాడ తాలూకాలోని వెంకటరాఘవపురం అనే గ్రామంలోపుట్టిన వాడికి,
( 20-9-1924) చిన్నతనంలో ఆకతాయిగా తిరిగిన వాడికి, చదువు సరిగా అబ్బని వాడికిఆ పాటా ఈ పాటా పాడుకుంటూ, నాటకాల్లో వేషాలు వేస్తూ పెరిగిన వాడికి - సినిమాఅవకాశం వచ్చింది..!! ఏ కళయినా వంశానుగతంగా వస్తుందంటారు.
కాని, మా కుటుంబంలో ఎవరూ నటులు లేరు. నేనేదో గాలికి తిరుగుతూ 'గాలి పాటలు' పాడే వాడిని తప్ప, పాట నేర్చుకోలేదు, సంగీతం అసలు తెలీదు. పెదవిరివాడలో ఒకటో ఫారం చదువుతున్నప్పుడు, మా వూరి స్కూల్లో 'హరిశ్చంద్ర' వేస్తున్నారు పిల్లలు. నారదుడు
వేషం ఎవరు? నేనేదో పాట, పద్యం పాడేస్తున్నానని నా చేత వేయించారు. ఏం పాడానో,ఏం నటించానో తెలీదు గాని, 'బాగానే చేశావు' అని అంతా అన్నారు. అది తొలి అనుభవం తర్వాత వెంకట రాఘవపురం స్కూలు వార్షికోత్సవంలో చంద్రమతి వేషం ఇచ్చారు. తొలి ఆడవేషం.
నేను ఆడవేషం వేస్తున్నానని మా అమ్మ కూడా చూడ్డానికి వచ్చింది.
అమ్మకి ఆడపిల్లలు లేరని ఆడపిల్లగా నేనెలా వుంటానో అని, ఆ వేషంలో చూడాలని
వచ్చింది అమ్మ, "ఆచ్చం ఆడపిల్లలాగే వున్నావురా" అని అందరూ మెచ్చు కున్నారు.
అమ్మకీ బాగానచ్చాను. ఇంటి దగ్గర అమ్మకి ఆపనీ ఈ పనీ చేస్తూ సాయపడుతున్నప్పుడు
మధ్యలో "ఆ పద్యం చదవరా", ఈ “పాటపాడు" అని నాచేత మళ్లీ మళ్లీ పాడించుకునేది. బయట పొలాల్లోతిరుగుతూ వుంటే, అక్కడి వాళ్లు కూడా పాడమనే వారు.
పాడేసే వాణ్ణి, అంతే! అదే సాధన! అంతకంటె గొప్ప
ప్రాక్టీస్ అంటూ ఏమీ లేదు.
నాకు చదువుమీద వున్న శ్రద్ధ
కంటె, పాటలు పద్యాలూ పాడడం మీదనే ఉత్సాహంఎక్కువగా వుందని, మా అన్నగారు, అమ్మ అనుకునేవారు
ఏందుకురా ఆ పాటలూ? నాటకాలెందుకు? చక్కగా,చదువుకో" అని పెద్దలు నిరుత్సాహ పరచకపోడమే నాకుపెద్ద దీవెన ఐంది.
కుదరవల్లి నాటక సమాజం వాళ్లు మా అన్నగారిని అడిగి, నాచేత వేషాలు వేయించారు. అప్పుడు బాగా ప్రాక్టీసు ఇచ్చారు. అభినయం, వచనం నేర్పారు.
ఇలా కృషి చేస్తే రాణిస్తానని కూడా అనుకున్నారు.
అమ్మగారు, అన్నగారూ ప్రోత్సహించడంతో, నాటకాల్లో
ఆ వేషాలు ఖాయమైనాయి. సినిమాల్లోకి వచ్చి "హీరో"గాపేరు తెచ్చుకున్న వాడిని, మొదట్లో హీరోయిన్'గా పేరు
తెచ్చుకున్నాను. 'అదో విచిత్రం' అనిపిస్తుంది నాకు..కొద్దిపాటి తెలుగు, హిందీ (మాధ్యమిక)
నేర్చుకున్నాను గాని, సంగీతం నేర్చుకోలేదు. హార్మోనిస్టు
ఎలా పాడమంటే అలా పాడేసేవాడిని. అంతకంటే
మనకేం ప్రతిభ లేదు. నిదానంగా నాటకాల్లో స్థిరపడినా ఇంటి పనీ వంటింటి పనీ చేసే వాడిని.
తెల్లవారు జామునే
లేచి పాలు తియ్యడం, ఊడ్చడం, తాలింఖానాలో సాము నేర్చుకోవడం, అమ్మకి సాయం చెయ్యడం - ఇవన్ని అయిన తర్వాత, అన్నగారితో కలిసి, రెండు మైళ్లు నడిచి
కుదరవల్లిలో నాటకం రిహార్పల్స్. ఇలా వుండేది దినచర్య గ్రామాల్లో ఎక్కడో చోట కోలాటాలు, భజన్లు
జరిగేవి, ఊరేగింపుల్లో పాటలు పాడే వారు. నేనూ వాళ్లతో
కలిసి పాడేవాడిని. ఆడపిల్ల మొహం, ముక్కు కన్నూ తీరుగా వున్నాయనే నాకు ఆడవేషాలు వచ్చాయి. మాకు పాతిక ఎకరాల భూమి వుండేది గనుక, నన్ను 'చిన్నదొర' అనేవారు.
ధన సంపాదన చెయ్యాలని, డబ్బుని పొదుపుగా వాడాలనీ చిన్నతనంలోనే వుండేది నాకు. పొలాల్లో పనలుకుప్పలు వేస్తున్నపుడు కంకులు కింద పడతాయి. అవి కుర్రాళ్లు ఏరుకుంటారు, ఒక్కొక్కరికి బస్తా వస్తాయి. నేనూ వెళ్లి ఏరుకునేవాడిని. ఒకబస్తా అమ్మితే వచ్చే డబ్బుల్లోంచి ఒక పాప్లిన్ చొక్కా కుట్టించుకునే వాడిని. అప్పుడు ఎంత అనుకున్నారు? పావలా. దాన్ని 'దాపుడు చొక్కా' అంటారు. అంటే ఎప్పుడో పండగ వచ్చినప్పుడు వేసుకునే దన్నమాట. అలా, జాగ్రత్తపడే స్వభావం నాకు చిన్నతనంలోనే అలవాట యింది. విసుగూ విరామం లేకుండా, పద్నాలుగు గంటలు పనిచేసేవాడిని. సినిమాలకొచ్చిన తర్వాత కూడా అలాగే పని చేశాను.
గుడివాడలో మోటూరి వీరరాఘవయ్యగారనీ మంచి హార్మోనిస్టు. ఆయన
పద్యాలు బాగానేర్పారు. ఆయనే మొదటి గురువు. 'కనకతార'లో తార వేస్తే. నా పద్యాలకి వన్స్ మోర్ లు, చప్పట్లు పడ్డాయి. అలాగే బుద్ధిరాజు శ్రీరామమూర్తిగారని ఇంకో హార్మోనిస్టు. ఆయన దగ్గరా నేర్చుకున్నాను. వై.భద్రాచార్యులుగారి దగ్గర కొంతకాలం పాటు, పద్య పఠనాభ్యాసం చేశాను. భజనల్లో గెంతడం, కోలాటాల వల్ల నాకు తాళజ్ఞానం బాగానే వుంది. శ్రుతిపక్వంగా, పద్యం చదవడం, లయబద్దంగా పాటలు పాడడం అలా వచ్చింది. ఏదైనా 'నేర్చుకోవాలి' అనుకుంటే దానిమీద ఏకాగ్రత పెట్టే వాడిని.పట్టుదల పెట్టే వాడిని. "సాధనము వలన పనులు సమకూరు ధరలోన" అన్నారు. సాధన చెయ్యగలిగితే, సానుకూలం కానిది ఏదీ వుండదని - అర్థం చేసుకున్నాను. (సశేషం)
అక్కినేని
(ఈ వ్యాసాలు చూచినవారు మీ అభిప్రాయాలు కామెంట్లు మాటలలో చెయ్యమని మనవి..
కాలాన్ని వెచ్చించి ఈ వ్యాసాన్ని మీకు అందించే నాకు స్ఫూర్తిదాయకంగావుంటాయనిగమనించగలరు....నూలు) .
Comments
Post a Comment