అక్కినేని మనసులోని మాట..పార్ట్-2
అక్కినేని మనసులోని మాట..పార్ట్-2
#బెజవాడరైల్వేస్టేషన్
మా "ఎక్సెల్షియర్" నాటక బృందం తెనాలిలో నాటకం ప్రదర్శించి బెజవాడ వచ్చి, గుడివాడ వెళ్లడానికి ప్లాట్ ఫాం మీద సరదాగా కబుర్లు
చెప్పుకుంటూ నవ్వుకుంటూ కేరింతలాడుకుంటూ బండి కోసంనిరీక్షిస్తున్నాం. బండి వచ్చి ఆగింది. ఎక్కడో దగ్గర మేం ఎక్కి కూచోడానికి
హడావుడి పడుతున్న సమయంలో, ఫస్ట్ క్లాసులో కూచున్న ఒక వ్యక్తి కళ్లు నా
మీద పడ్డాయి. నేనూ ఆయన్ని చూశాను. విశాలమైన ముఖం, బట్టతల కళ్లజోడుతో నిగనిగ లాడుతున్నారు. హిందీ సినిమాలు చూసే వాడిని గనక
ఆయన్ని చూడగానే సినిమాల్లో తండ్రి వేషాలు వెయ్యడానికి బాగుంటారే
అనిపించింది నా వూహకి. నావేపు ఆయన కూడా పరిశీలనగా చూస్తున్నారెందుకో..
దగ్గరికి పిలిచారు. ఏ వూరని అడిగారు. ఏం చేస్తుంటావని అడిగారు. నాటకాల్లో
ఆడవేషాలు వేస్తానని చెప్పడం, 'సినిమాల్లో వేస్తావా' అని ఆయన అడగడం, నేను
ఆనందపడుతూ "ఓ" అనడం నా వివరాలు తెలుసుకోవడం జరిగిపోయాయి..
ఆయనెవరో నాకు తెలీదు. అలా ఎందుకడిగారో తెలీదు. ఆతర్వాత తెలిసింది
అతర్వాత ఆయన దర్శకుడు, నిర్మాత ఘంటసాల బలరామయ్యగారని. నాతో
మాట్లాడుతున్నప్పుడు ఆయన నాలో, శ్రీరాముడి పాత్రని చూస్తున్నారని నాకేం
తెలుసు? ఆ కాస్సేపటిలోనే, ఆ రైల్వే ప్లాటుఫాం మీదనే నన్ను శ్రీరాముడిగాఊహించుకున్న ఆయన మేధాశక్తి ఎంతటి అపారమైనది! ఆ క్షణాలు- నా భవిష్యత్తును ఊహించుకున్న క్షణాలు! నేనొక నటుడిగా రూపొంది ఎందరి హృదయాల్లోనో సుస్థిరస్థానం
సంపాదించుకుంటానని జోస్యం చెప్పిన క్షణాలు! నాకెప్పుడూ అనిపిస్తుంది - అలా,బలరామయ్యగారు నన్ను ఆ సమయంలో చూడకపోయివుంటే, నా జీవితం ఎలావుండేదో..!?
ఆ సమయంలో ఆయన పక్కవారితో మాట్లాడుతూనో, పేపరు చదువుకుంటూ
వుంటేనో, ఆయన దృష్టి నామీద పడేది కాదు గదా! నేనూ నా బండెక్కి ఏ మూలో
కూచుని వుండేవాడిని. అప్పుడు ఆ శ్రీరాముడి పాత్ర వచ్చేదా? అసలు సినిమాల్లోకి వచ్చివుండేవాడినా...??
భవిష్యన్నిర్ణయం ఇలా వుంది కాబట్టి అక్కడ అప్పుడు అలా జరిగిందా? విచిత్రం! అందుకే, ఆసందర్భం, ఆ సమయం - నా జీవితంలో మధురమైనవి. అత్యంత మహత్తరమైనవి! నా జీవితాన్నిమార్చి, నాకొక రూపాన్ని ప్రతిష్ఠించిన ఆ శుభ సందర్భానికి నిరంతరం కృతజ్ఞుణ్ణి.. ఐతే, 'ఆదిలోనే హంసపాదు' అన్నట్టు తొలి అవకాశంలోనే సమస్యలు లేచాయి. సినిమాఉత్సాహం నాకుంది. నాకంటే మా అన్నగారు రామబ్రహ్మంగారికీ వుంది. అంతకుముందే ఆయన ధర్మపత్తి' సినిమాలో బాలనటుడి వేషం వుందంటే - నన్ను కొల్హాపూర్ పంపించారు. ఆ అవకాశంఎలా వచ్చిందో నాకు తెలీదు. నాకు అప్పుడు పద్నాలుగేళ్లు. నాటకాల్లో వెయ్యడం ఆరంభమైంది.
ఏమాత్రం లోకజ్ఞానం లేదు. ఆ సినిమాకి నా బోటి వాళ్లే కొందరు పిల్లలు వచ్చారు. వాళ్లతో ఆడుతూ
పాడుతూ తిరిగేవాడిని. నాదేం వేషం కాదు. పిల్లలతో పాటు నేనూ ఒక దృశ్యంలో కనిపించాను
అంతే! అది అక్కడితో అయిపోయింది. ఇది అలాంటిది కాదు. 'సీతారామ జననం'లో ముఖ్యపాత్ర
శ్రీరాముడు. అప్పటికి నేను నాటకాల్లో ముఖ్యమయిన స్త్రీ పాత్రలు వేస్తున్నాను. నేను సినిమాలకి వెళ్లిపోతే, మా సంస్థ ప్రదర్శిస్తున్న నాటకాలు ఆగిపోతాయి. అదీ కాకుండా, 'నాటకాల్లో ఆడవేషాలు
వేస్తున్నాడుగా - సినిమాలో ఈ మగవేషం వేస్తే ఎలా వుంటాడో? బాగాలేకపోతే మళ్లీ వేషం ఎవరిస్తారు
రెంటికీ చెడ్డ రేవడి' సామెతలాగా తయారవుతాడేమో!...' ఇవీ పెద్దల సందేహాలు, "మీరు
ఆలోచించుకుని నిర్ణయించుకోండి" అన్నారు బలరామయ్యగారు.
నేను సందిగ్ధంలో పడ్డాను.
దానంతగా వచ్చి అవకాశం తలుపు తట్టింది. తలుపు తీసి లోనికి రానివ్వడమా? అలా వెనక్కి పంపించేయడమా?
ప్రసిద్ధుడైన మేకప్మేన్ మంగయ్యగారు నా "శ్రేయోభిలాషి" నాటకాల్లో అప్పుడప్పుడు
వచ్చి మేకప్ చేసేవారు. ఆయన నా సమస్యకి పరిష్కారం చెప్పారు. "నువ్వుగా ప్రయత్నించలేదు
బలరామయ్యగారంతటివాడు స్వయంగా వచ్చి అడుగుతున్నారు. ఈ సినిమా తర్వాత వేషాలు రాలేదనుకో. నష్టం ఏమీ లేదు. మళ్ళీ నాటకాలు ఆడుకోవచ్చు. కొన్నాళ్లకి నీ గొంతులో మార్పు
వస్తుంది. అప్పుడు ఆడవేషాలు ఏం వేస్తావు? మగవేషాలు వేసుకోవచ్చు. అంచేత, ఈ వేషం
వెయ్యడానికి ఆలోచించకు మంచి అవకాశం" అన్నారు మంగయ్యగారు. ఆయన అనుభవశాలి. ఆయన మీద నాకు ఎంతో గౌరవం. అయన మాట ప్రకారం, సరే" అనుకున్నాను. ( సశేషం) - అక్కినేని
(ఈ వ్యాసాలు చూచినవారు మీ అభిప్రాయాలు కామెంట్లు మాటలలో చెయ్యమని మనవి..
కాలాన్ని వెచ్చించి ఈ వ్యాసాన్ని మీకు అందించే నాకు స్ఫూర్తిదాయకంగావుంటాయనిగమనించగలరు....నూలు) .
Comments
Post a Comment