★అక్కినేని"మనసులోని మాట"పార్ట్ -10★
★అక్కినేని"మనసులోని మాట"పార్ట్ -10★
#రామబ్రహ్మంగారు సరదాకి తమాషాలు చేస్తూ నన్ను ఆటపట్టించే వారు.అప్పుడు డిస్ట్రీబ్యూటర్లు దగ్గరనుంచి ప్రతి నెలా కొంత డబ్బు వస్తుండేది. ఒక్కోసారి కాస్త ఆలస్యమయేది. అప్పుడు రామబ్రహ్మంగారు "ఒరే షావుకారూ - ఓ రెండు వేలు ఇవ్వరా....అనేవారు.
నేను బాంక్లో దాచుకున్న డబ్బులోంచి, రెండువేలకు చెక్కు రాసి ఇచ్చే వాడిని ఎంత అనందపడే వాడినో! నేను చెక్కురాసి ఇచ్చానని. అప్పట్లో ఆఫీసు జీతాలు 200, 300 అలా వుండేవి.ఆ తర్వాత డబ్బు రాగానే నాకు తిరిగి ఇచ్చేసేవారు. ఎంత ఆప్యాయత! ఎంత చనువు అలాగే మధుసూదనరావు గారు నా మీద 'డేగ కన్ను' వేసి వుంచేవారు. అభివృద్దిలోకి రావలసిన కుర్రాడిని గనక, ఎప్పటి కప్పుడు జాగ్రత్తలు చెబుతూ వుండేవారు. ఓ కంటితో నన్ను కనిపెట్టమని, లంక సత్యం గారికి అప్పజెప్పారు. ఇలాంటి కట్టుదిట్టాల మధ్య, నా బాగోగులు చూస్తూ
నా అభివృద్ధి కాంక్షించారు పెద్దలు. క్రమశిక్షణకీ, ఒక విధానానికీ కట్టుబడి వుండాలని, అవే భావి
జీవితాన్ని రక్షిస్తాయనీ, అందరికీ ఈ లక్షణాలు వర్తిస్తాయనీ నిదానంగా తెలుసుకున్నాను. మనం
పెరిగే వాతావరణం, మెసిలే పరిసరాలు, మనుషులవ్యక్తిత్వాలు వాటి మీదనే జీవితం ఆధారపడి పుంటుంది. నా అదృష్టం, నా పూర్వజన్మ సుకృతంవల్ల -
ఒక మధుసూదనరావుగారి వంటి వారు బలరామయ్యగారు, రామబ్రహ్మంగార్ల వంటి వారూనన్ను సక్రమమైన దార్లో నడిపించారు.
చిత్ర దర్శకుడంటే - షూటింగ్లో ఏదో షాట్స్ తీసే వ్యక్తి మాత్రం కాదు. అతనికీ నటుడికీ మధ్యవున్న అనుబంధం అక్కడితో ఆగిపోకూడదు.
బయట కూడా ఆ అనుబంధం కొనసాగాలి.అన్న విషయం నా విషయంలో రుజువైంది. ఒక సంస్థకి దర్శక నిర్మాతలు తల్లిదండ్రుల్లాంటి వారు.
దర్శకుల్లో ఒక్కొక్కరిదీ ఒక్కొక్క పద్ధతి. ఒక దృశ్యం చెప్పి ఆలోచించమంటే, ఒక దర్శకుడు ఒకలా, ఇంకో దర్శకుడు ఇంకోలా ఆలోచిస్తారు. టేకింగ్లో కూడా మార్పులుంటాయి.
అందరు దర్శకులూ, ఒకేలా తియ్యరు. వారి వారి అవగాహనా దృష్టి ఆలోచనా శక్తినిపుణత్వం మీద ఆధారపడి వుంటుంది. అలాగే నటులు కూడా, వాళ్ల వాళ్ల విధానాల్లో నటిస్తారు. ఉదాహరణకి నేను 'అర్థాంగి'లో వేసిన పాత్ర వుందనుకోండి ఇంకొక నటుడికిఇస్తే అతను ఇంకోలా చేస్తాడు. అదీ రైటే, ఇదీ రైటే. దర్శకుల్లో కొందరు దర్శకులు నటులకి దృశ్యం వివరించి, నటుడికి వదిలేస్తారు. కొందరు స్పూర్తి కలిగిస్తారు. కొందరునటించిన విధానం చూసి హెచ్చుతగ్గులు చెబుతారు. తొలిరోజుల్లో సంభాషణలు ఎలాచెప్పాలో ఎలా చెయ్యాలో నాకు చెప్పేవారు - దర్శకులు.
సీతారామ జననం'లో బలరామయ్యగారు "ఇలా చెయ్యి, అలా చెప్పు" అని
నాకు చెప్పి చేయించినట్టు గుర్తు లేదు. ఆయన మంచి నిర్మాత. కథని సమ కూర్చుకోడం సరైన నటినటుల్ని ఎన్నిక చేసుకుని చిత్రం నిర్మించడం ఆయనకు బాగా తెలుసు.
సీతారామ జననం' తర్వాత, 'ముగ్గురు మరాటీలు', 'బాలరాజు', 'శ్రీలక్ష్మమ్మ కథ',
స్వప్నసుందరి' సినిమాల్లో నేను నటించాను. 'రేచుక్క' వారిదే. నేను గెస్ట్ గా వేశాను.
పి.పుల్లయ్యగారు దర్శకులు. .
సినిమా నటన, టెక్నికల్ అంశాలు నిదానంగా నాకువంటబడుతూ వచ్చాయి గనక, తర్వాతి చిత్రాల్లో బలరామయ్యగారు నాకు ఎక్కువ తక్కువలు చెప్పేవారు గాని, 'ఇలా చెయ్యాలి' అని చెప్పలేదు. నేను అభివృద్ధిలోకి వస్తుంటే అయన ఎంత సంతోషించేవారో చెప్పలేను. అభివృద్ధి సాధిస్తున్న కొడుకును చూసి తండ్రి
పడే ఆనందం ఎలాంటిదో ఆయన దగ్గర చూశాను.
(సశేషం) -అక్కినేని
(ఈ వ్యాసం చూచినవారు మీ అభిప్రాయాలు కామెంట్లు మాటలలో చెయ్యమని మనవి..
కాలాన్ని వెచ్చించి ఈ వ్యాసాన్ని మీకు అందించే నాకు స్ఫూర్తిదాయకంగా వుంటాయని గమనించగలరు....నూలు
Comments
Post a Comment