అక్కినేని "మనసులోని మాట" పార్ట్-25
★అక్కినేని "మనసులోని మాట" పార్ట్-25★
దేవుడున్నాడా..!!??
నా దృష్టిలో "దేవుడు" అనే పదార్థం ఒక అద్భుతమైన సృష్టి . అవును. 'పురాణ పాత్రలన్నీ సృష్టింపబడినవే- అవి జరిగినవి కావు' - అని భారత, భాగవతాలు రచించిన వ్యాసుడే చెప్పాడు
"ఇతిహాస పురాణేభ్యామ్
వేదస్సముప బ్రహ్మయేత్
నరామో నవాపి కృష్ణ
న సీత న చరుక్మిణి I"
సామాన్య మానవులకు, మూర్ఖులకు, జ్ఞాన హీనులకు, అజ్ఞానులకు, మంచి చెడ్డలు, నీతి
నీజాయితీ, ధర్మా ధర్మాలు, న్యాయాన్యాయాలు అనే విషయాలను తెలియజెప్పడానికి, ఉదాహరణగా సృష్టించబడిన పాత్రలు మాత్రమే- అని చెప్పారాయన. దైవం ప్రజల్ని భయపెడుతుంది. దైవభీతి వుండవలసిందే. 'దేవుడున్నాడు-చూస్తున్నాడు' అంటేనే - మానవులు ఇన్ని తప్పులు, నేరాలూ చేస్తున్నారే- అసలు ఆ భయంకూడా లేకుండాపోతే, ఈ మానవులు ఎలా వుండేవారో! ఏమైనా ఎవరి అభిప్రాయం వారిది. నాది చిన్నతనం నుంచి తార్కిక స్వభావం. ఏదైనా తర్కానికి నిలబడాలి.
నాకెందుకో దేవుడు అనే వాడున్నాడనీ, అతను విగ్రహాల్లో వుంటాడనీ నమ్మకంలేదు. పెద్దవాళ్లకి ఆ నమ్మకాలుంటాయి. నా పెళ్లయిన తర్వాత సత్యనారాయణ వత్రం చెయ్యాలని అమ్మ చెప్పింది.అప్పుడు నాకు 24 ఏళ్లు, "ఎందుకమ్మా' అని ఓ మాటగా అన్నా- అమ్మకోసం వ్రతం ఆచరించాను.
నా నమ్మకం నాది, ఐతే ఇంకొకరి అభిప్రాయంతోనూ, నమ్మకాలు, విశ్వాసాలతోనూ విభేదించను
నా నమ్మకాన్నే మీరూ పాటించండి" అని ఎవరికీ ఉద్బోధ చెయ్యను. కాకపోతే ఏదైనా విషయాన్ని గ్రహించాలంటే వితండవాదం లేవదీయాలి. 'దేవుడు లేడు' అని నేనంటే- అవతలివాళ్లు ఉన్నాడని మాట్లాడతారు. దానిమిద చర్చ జరిగితే, చాలా విషయాలు నాకు తెలుస్తాయి. ఐతే, నేనేదో
గొప్పవాడినని చెప్పడానికి ఈ మాట చెప్పడంలేదు, నేనెప్పుడూ ఆ మాట చెప్పుకోను. ఇన్నిసంవత్సరాలుగా, ఈ సినిమా ప్రపంచంలో వున్నాను. విభిన్నమైన పాత్రలు చేసి, మంచి నటుడనిపించుకున్నాను. అవార్డులు అందుకున్నాను. ఇప్పటికీ నా ప్రజాదరణ నాకు వుంది.అభిమానులు వస్తూనే వుంటారు. ఐతే నేను గొప్పవాడినని అనుకోవచ్చుగా! కాదు. నా కంటే గొప్పవాళ్ల ఎందరో వున్నారు. ఇంకా నేను తెలుసుకోవలసిందీ, నేర్పుకోవలసిందీ ఎంతో వుంది! నాకు జిజ్జాాస ఎక్కువ, ఆ జిజ్ఞాసే లేకపోతే, శుద్ధ పల్లెటూరి అనాగరీకుడికి ఈ మాత్రమైనా లౌకిక జ్ఞానం కలిగేదా...
సశేషం
-అక్కినేని
(ఈ వ్యాసం చూచినవారు మీ అభిప్రాయాల వ్యాఖ్యలు అక్షరాల రూపంలో చెయ్యమని మనవి..
కాలాన్ని వెచ్చించి ఈ వ్యాసాన్ని
మీకు అందించే నాకు స్ఫూర్తిదాయకంగా వుంటాయని గమనించగలరు....నూలు
Comments
Post a Comment